నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని ధోనిగమ్ వాగులో సోమవారం మధ్యాహ్నం స్నానానికి వెళ్లి ఈత రాక ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని వైకుంఠపుర్ గ్రామానికి చెందిన సతేల్లి సాయి ప్రసాద్ (23)గా గుర్తించారు.
సాయి ప్రసాద్ తన గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ధోనిగమ్ వాగులో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో, ఈత రాక సాయి ప్రసాద్ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, స్నేహితులు యువకుడిని బయటకు తీయగా, అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి సాయన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. యువకుడి మృతి పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






