పశువులకు ఏడాది పొడవునా నాణ్యమైన పచ్చిమేత అందుబాటులో ఉంచడంతో పాటు పశుపోషకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం వ్యక్తిగత పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి తెలిపారు. అర్హులైన రైతులు తమ భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేసుకుని మేతను సొంతంగా సమకూర్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
పశువులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పశుగ్రాసాన్ని సొంతంగా సాగు చేసుకోవడం వల్ల బయట నుంచి మేత కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గి, పశుపోషణ ఖర్చులను నియంత్రించుకోవచ్చని వివరించారు. తద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద పశుగ్రాస సాగుకు అనువైన భూమి, అవసరమైన నీటి వసతి కలిగిన రైతులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పశుగ్రాస సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు సామగ్రికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సహాయం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా అనువైన పశుగ్రాస పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సబ్సిడీ వివరాల కోసం సమీపంలోని పశువైద్యశాల లేదా సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి కోరారు.












