నవంబరు 15 నుండి 18 వరకు నల్గొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలను విజయవంతం చేయాలని రైతు జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలో రైతు మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జయరాజు అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూమి, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరల సమస్యలపై చర్చించేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబరు 15వ తేదీన లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, దీనిని రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పండించిన పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించడం లేదని, ఎరువులు, విత్తనాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని, విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తున్నారని, కరువుతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం జరిగే ఈ అఖిల భారత మహాసభలను రైతులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు జిల్లా కార్యదర్శి యస్.రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు రాములు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.












