నకిలీ పత్తి విత్తనాల సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ దిశగా పలు సూచనలు చేశారు.
జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి మండలంలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, నకిలీ విత్తనాల సరఫరాదారులపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
గ్రామాలలో దళారులు విడిగా పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే, పోలీసు సిబ్బందికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. నకిలీ, నిషేధిత పత్తి విత్తనాల వినియోగం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించి, జిల్లా సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
రైతులు ప్రభుత్వ అనుమతి గల విత్తనాలను మాత్రమే వినియోగించాలని, లైసెన్సు లేని దుకాణాల ద్వారా విక్రయించే ఏ విత్తనమైనా నకిలీ విత్తనంగానే పరిగణించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత షాపుల వద్ద నుండి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద నకిలీ విత్తనాల వాడకం వలన రైతులకు, పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించాలని తెలిపారు.
గత సంవత్సరం జిల్లాలో 17 కేసులు నమోదు చేసి, 54 మందిని అరెస్టు చేసి, సుమారు 14 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు డిసిపి ఎ.భాస్కర్ సమావేశంలో తెలిపారు. విత్తనం నాటే సమయానికి ముందే పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రారంభించి, నకిలీ విత్తనాలను అరికట్టడంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.








