జిల్లా మందమర్రిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, , కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని, సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మందమర్రి పట్టణంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం, ప్రసిద్ధ త్రిశక్తి అష్టలక్ష్మి దశమహా విద్య కామాఖ్య దేవాలయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, , వారి సతీమణి డాక్టర్ తృప్తి మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. పవిత్రమైన ఈ సందర్భంలో సీపీ దంపతులు అమ్మవారిని దర్శించుకుని, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ఆధ్యాత్మికత అనంతమని, ఎవరి మత విశ్వాసాలు వారివని అన్నారు. అమ్మ దయ ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్లేనని, మానవ జన్మకు తల్లే మూలకారణమని, కన్న తల్లిని పూజించడం ప్రథమ ధర్మమని ఉద్ఘాటించారు. ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా సహకరించాలని పిలుపునిచ్చారు.
యువత డ్రగ్స్ బారిన పడటంపై ఆవేదన
నేటి యువత దేశానికి వెన్నెముక లాంటిదని కొనియాడిన సీపీ, దురదృష్టవశాత్తు కొందరు యువకులు మాదకద్రవ్యాలకు (డ్రగ్స్ కు) బానిసై చిన్న వయసులోనే తమ అమూల్యమైన జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తి భావంతో దేవాలయాలను సందర్శించి, నిర్మలమైన మనసుతో సన్మార్గంలో నడుచుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని సాగించాలని యువతకు సూచించారు. పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాదని, సమాజహితమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఆలయ నిర్వాహకులను ప్రశంసించిన సీపీ
తక్కువ కాలంలోనే మందమర్రి కామాఖ్య దేవాలయం అద్భుతమైన రీతిలో భక్తుల మన్ననలను పొందడం విశేషమని, ఇంతటి మహిమాన్విత ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న నిర్వాహకులను, భవాని సతీష్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కామాఖ్య దేవాలయం నిర్వాహకులు భవాని సతీష్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజంలో ధర్మబద్ధమైన జీవనం సాగించాలని కోరారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో, అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.












