ఆధార్ కార్డు కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భైర్కమ్మరి పావని (13), ఆమె చెల్లెలు అఖిల (8)కు ఎట్టకేలకు గుర్తింపు పత్రాలు లభించాయి. విశ్రాంత మండల విద్యాధికారి డి. అంజయ్య సుమారు ఐదు నెలల పాటు చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ బాలికలకు ఆధార్ కార్డులు అందాయి.
వివరాల్లోకి వెళితే, పావని, అఖిల తండ్రి అంకుష్ చిన్నతనంలోనే మరణించాడు. తల్లి రేణుక కమ్మరి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా బాలికలు తల్లికి కమ్మరి పనిలో సహకరించేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన సంగారెడ్డి జిల్లా బాలసదన్ అధికారులు పావనిని మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చేర్పించారు. అయితే, జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో ఆధార్ కార్డు పొందడం సాధ్యం కాలేదు. సమస్య పరిష్కారానికి విశ్రాంత మండల విద్యాధికారి డి. అంజయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్, అంగన్వాడీ టీచర్ ధ్రువీకరణ పత్రం, నోటరీ అఫిడవిట్ వంటి పత్రాలను సమకూర్చి మీ-సేవ ద్వారా దరఖాస్తు చేయించారు.
జీపీఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఎంఈఓ, తహసీల్దార్ తదితర అధికారుల పరిశీలన అనంతరం ఆర్డీఓ ప్రొసీడింగ్స్ పొందేందుకు కృషి చేశారు. అనంతరం, గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం పొంది ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. చివరకు, ఐదు నెలల నిరంతర ప్రయత్నాల ఫలితంగా పావని, అఖిల ఇద్దరికీ ఆధార్ కార్డులు లభించాయి. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు, నిరుపేద కుటుంబాల పిల్లలు, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లలు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లేక అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని డి. అంజయ్య తెలిపారు. జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆధార్ కార్డులు లేని అనాథ, పేద పిల్లలను గుర్తించి వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందించాలని ఆయన కోరారు. ప్రతి పేద బాలబాలికకు విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ముందుగా వారికి గుర్తింపు పత్రాలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఒక ఆధార్ కార్డు ఇద్దరు బాలికల జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. విద్యకు దూరమైన పిల్లలను బడిబాట పట్టించడం, వారికి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.












