మంచిర్యాల పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, విద్యార్థులకు ప్రత్యక్షంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి కృతజ్ఞతగా, ఎథిక్ అకాడమీ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం పోలీసు శాఖకు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు ట్రాఫిక్ నియమాల గురించి కేవలం పుస్తకాలు, తరగతి గది బోధనల ద్వారా మాత్రమే తెలుసుకున్న చిన్నారులు, ఇప్పుడు ప్రత్యక్షంగా సిగ్నల్స్ ను గమనించడం ద్వారా వాటి ప్రాముఖ్యతను మరింతగా అర్థం చేసుకుంటున్నారు. ఇది వారి అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా, పాఠశాల విద్యార్థులు స్వయంగా మంచిర్యాల డీసీపీ Aggadi Bhaskar గారిని కలిసి, తాము స్వయంగా రూపొందించిన ట్రాఫిక్ సిగ్నల్స్ చిత్రాలను, "థాంక్యూ పోలీస్" సందేశాలతో కూడిన కృతజ్ఞతా పత్రాలను అందజేశారు.
పాఠశాల యాజమాన్యం తరఫున, అలాగే మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థుల తరఫున అధికారిక కృతజ్ఞతా పత్రాన్ని డీసీపీకి సమర్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద "Thank You Police for Making the Signals Real" అనే బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా తమ అభినందనను వ్యక్తం చేశారు.
పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, "పిల్లలకు నేర్చుకునే విషయాలు జీవితంతో అనుసంధానం అయినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ సిగ్నల్స్ ద్వారా తరగతి గదిలో నేర్చుకున్న విషయం ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంగా మారింది. ఇది పిల్లల అభ్యాసానికి గొప్ప తోడ్పాటు" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మి రెడ్డి, ఏఎస్ఐ సలీమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








