భారత క్రికెట్ జట్టు పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో తన ప్రేమాయణంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు నటి, మోడల్ సమరీన్ కౌర్ గట్టిగా బదులిచ్చారు. అర్ష్‌దీప్‌తో సంబంధం పెట్టుకోవడం ద్వారా పేరు, డబ్బు సంపాదించాలనుకుంటున్నారంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. తన వ్యక్తిగత జీవితంపై ఇతరులు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆమె కోరారు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సమరీన్ స్పందిస్తూ, తాను 17 ఏళ్ల వయసు నుంచే పనిచేస్తున్నానని, ఆర్థికంగా, వృత్తిపరంగా స్వతంత్రంగా ఎదిగానని తెలిపారు. ఇప్పటివరకు 20కి పైగా దేశాలు పర్యటించానని, తన జీవితాన్ని సొంతంగా నిర్మించుకున్నానని పేర్కొన్నారు.
ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తే ప్రచారం కోసం చేస్తున్నారని, వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచితే భాగస్వామిని గౌరవించడం లేదని విమర్శించడం సోషల్ మీడియాలో కొందరి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు.
మహిళలే మహిళలను విమర్శించడం బాధాకరం
ముఖ్యంగా కొందరు మహిళలు మరో మహిళను కించపరచడం తనకు బాధ కలిగిస్తోందని సమరీన్ తెలిపారు. ఆధారంలేని అభిప్రాయాలు, ఊహాగానాలు, ప్రతికూల వ్యాఖ్యలు తనను విసిగిస్తున్నాయని చెప్పారు. తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిని, తన టీమ్‌తో కలిసి బ్లాక్ చేస్తానని స్పష్టం చేశారు. తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు తనకు ఉందని, తన పోస్టులు నచ్చకపోతే తన సోషల్ మీడియా పేజీని చూడటం మానుకోవచ్చని పేర్కొన్నారు.
అర్ష్‌దీప్ సింగ్ మద్దతు
సమరీన్కు అర్ష్‌దీప్ సింగ్ కూడా మద్దతుగా నిలిచారు. ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీని రీషేర్ చేస్తూ, నిన్ను చూసి గర్వంగా ఉంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. మా జీవితంలో మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అతిగా ఆలోచించే వారు కొంత విరామం తీసుకోండి. మీరు మీ జీవితాన్ని జీవించండి, ఇతరులను కూడా జీవించనివ్వండి అని పేర్కొన్నారు. ప్రేమను పంచాలని, ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలని ఆయన కోరారు. తమకు నిజమైన ప్రేమ, మద్దతు అందిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
అర్ష్‌దీప్ సింగ్, సమరీన్ కౌర్ తమ సంబంధాన్ని 2020లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. అప్పటి నుంచి వీరి జంట సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

