ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మించిన తాజా చిత్రం మాయలేడి ట్రైలర్ హైదరాబాద్లో విడుదలైంది. ప్రశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెంగాలీ నటి మధుమిత సర్కార్ కథానాయికగా నటించారు. ఈ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ప్రకారం, క్రిష్ అనే యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆశ అనే యువతి పరిచయమవుతుంది.
ఇద్దరి మధ్య ప్రేమ మొదలైన తర్వాత ఆశకు రూప అనే కవల సోదరి ఉందని తెలుస్తుంది. ఇద్దరి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండటంతో క్రిష్ జీవితంలో ప్రేమ, గందరగోళం, నవ్వులు, భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో కథ ఎలా మలుపులు తిరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండనుంది.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాకేష్ వర్రే మాట్లాడుతూ, రెండేళ్ల విరామం తర్వాత మంచి సంగీతం, కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలగలిపిన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఏడాది పాటు కథపై పనిచేసినట్లు ఆయన చెప్పారు.
దర్శకుడు ప్రశంకర్ మాట్లాడుతూ, ప్రేమ బంధంలో ఎదురయ్యే సంతోషం, కోపం వంటి విభిన్న భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించామని పేర్కొన్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ వర్రే నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సత్య, ఇంద్రజ, మైసూర్ సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

