రాముని చెరువు అభివృద్ధి పనులలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ నాయకులు తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో రాముని చెరువు కట్ట వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అమృత్ పథకం కింద చెరువు పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.98 కోట్లు మంజూరు చేసిందని, అయితే అధికారులు ఈ నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా, అనవసరమైన పనులకు మళ్లిస్తున్నారని తులా మధుసూదన్ రావు ఆరోపించారు.
చెరువును క్రమంగా పూడ్చివేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి కేటాయించిన నిధులను ఉపయోగించకుండా, కట్ట పనులలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెరువులోని కొంత భాగాన్ని కేటాయించే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. చెరువులను పూడ్చి మైదానాలుగా మార్చడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు.
లోకాయుక్తలో ఇప్పటికే రాముల చెరువుపై కేసు నడుస్తున్న తరుణంలో, అధికారులు చెరువును కాపాడే బదులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల శాసనసభ్యులు ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని, చెరువుకు సంబంధించిన 47 ఎకరాల 32 గుంటల స్థలాన్ని గుర్తించి కాపాడాలని ఆయన కోరారు.
స్వచ్ఛంద పౌర సేవ సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య మాట్లాడుతూ, అధికారులు నిధులు ఖర్చు చేయడంలో శ్రద్ధ చూపుతున్నారని, కానీ భవిష్యత్ తరాలకు ఈ జలాశయం ఎలా ఉంటుందనే ఆలోచన చేయడం లేదని అన్నారు. చెరువులో జరుగుతున్న పనులను ఆపి, చుట్టూ కంచె నిర్మాణం చేసి, చెరువు కబ్జా కాకుండా చూసే విధంగా నిధులను ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












