పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని 32 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. విద్యార్థులకు పోలీసు విధులు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అక్టోబరు 27న జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నుంచి 31 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు పట్టణానికి చెందిన యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం సంతోషకరమని అదనపు ఎస్పీ అన్నారు. ఈ శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆమె తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని ఆమె పిలుపునిచ్చారు. కుల మత భేదాలు లేని రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, అందుకే రక్తదానానికి ఎంతో విలువ ఉందని తెలిపారు. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలుగా నిలవాలని ఆమె సూచించారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రతలో షీ టీమ్స్ పాత్ర, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను ఆయా విభాగాల సిబ్బంది విద్యార్థులకు వివరించారు. మహిళలపై వేధింపులు జరిగినప్పుడు జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని, మహిళలు షీ-సేఫ్ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంటూ, వాటి నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు సదా నాగరాజు, నాగేశ్వర్ రావు, నగేష్, రవీందర్, పోలీసు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది, బ్లడ్ బ్యాంకుకు చెందిన రాజు, విజయ్, పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.

