సంగారెడ్డి, 2026-11-22
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు, పోలియో నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు, పోలియో వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ పీహెచ్సీ, పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో శిబిరాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పోలియో నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా సహకరించాలని అన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, డీఎంఎంహెచ్ఓ డాక్టర్ లలిత దేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జైరామ్ నాయక్, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



