మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాల భరోసా కార్యక్రమంలో భాగంగా 21 మంది పిల్లలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖల సమన్వయంతో ఆరు సంవత్సరాలు లోపు పిల్లలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు అవగాహన శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి, కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని 974 అంగన్వాడీ కేంద్రాలలో ఆర్బీఎస్కే వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షలలో 21 మంది పిల్లలు సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన వారిగా గుర్తించబడ్డారు. వీరికి నేడు ప్రత్యేక వైద్యులచే చికిత్స అందిస్తున్నారు. స్పీచ్ థెరపీ, చెవి, ముక్కు, గొంతు, మానసిక ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపాలు వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు వైద్య సేవలు అందుతున్నాయి.
పిల్లల ఆరోగ్య అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, వ్యాధులను సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సినేషన్ల ప్రాముఖ్యతను, ముఖ్యంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ ద్వారా క్యాన్సర్ నివారణ గురించి వివరించారు. పిల్లల ఎదుగుదల లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత, జిల్లా ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ వేదవ్యాస్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీ ర ఊఫ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్ అధికారులు, సిడిపిఓలు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు, ఆర్బీఎస్కే వైద్య సిబ్బంది, బాలల సంరక్షణ విభాగం అధికారులు పాల్గొన్నారు.












