అంగారక గ్రహం (మార్స్) పూర్తిగా భౌగోళికంగా చనిపోయిన గ్రహం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, మార్స్‌పై అగ్నిపర్వత కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు.
ముఖ్యంగా ఆల్బా మోన్స్ అగ్నిపర్వత ప్రాంతంలోని పగుళ్ల నుంచి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు వెలువడుతున్నట్లు గుర్తించారు. భూగర్భంలో ఉన్న శిలాద్రవం నుంచి ఈ వాయువు విడుదలవుతుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మార్స్ ఉపరితలంపై శీతాకాలంలో మంచుతో మూసుకుపోయే పగుళ్లు, వేసవిలో మంచు కరిగి ఆవిరైనప్పుడు తెరుచుకుని వాయువులను బయటకు పంపుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి గ్రహం అంతర్భాగంలో ఇప్పటికీ కొంత వేడి ఉండి, అగ్నిపర్వత ప్రక్రియలు కొనసాగుతుండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూగర్భంలో శిలాద్రవం, నీరు పరస్పరం చర్య జరిపితే సూక్ష్మజీవులు మనుగడ సాగించేందుకు అనువైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, మార్స్‌పై ప్రస్తుతం అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు ప్రత్యక్ష ఆధారాలు ఇంకా లభించలేదు.










