అమ్మకాల పన్ను ఆధారంగా అదనపు పన్ను లేదా సర్‌చార్జి విధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దాదాపు 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ న్యాయపరమైన వివాదానికి ముగింపు పలుకుతూ, వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లపై విధించే పన్నుకు అదనంగా వసూలు చేసే పన్ను కూడా అమ్మకాల పన్నులో భాగమేనని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వి. మోహన సభ్యులుగా ఉన్నారు.
27 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం 1947 నాటి ఒడిశా అమ్మకాల పన్ను చట్టంలోని సెక్షన్ 5 కింద వ్యాపారులపై అదనపు పన్ను విధించింది. వార్షిక టర్నోవర్ రూ.10 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్న వ్యాపారులపై 10 శాతం, రూ.కోటికి మించి టర్నోవర్ ఉన్నవారిపై 15 శాతం అదనపు పన్ను విధించే నిబంధన తీసుకొచ్చింది. దీనిని వ్యాపారులు సవాలు చేశారు. అమ్మకాల పన్నుపై అదనపు పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉందా లేక ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయపు పన్ను అధికారాలను ఉల్లంఘిస్తుందా అనే ప్రశ్న తలెత్తింది.
ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వేర్వేరు తీర్పుల మధ్య విభేదాలు ఉన్నాయనే అభిప్రాయంతో 1999లో ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును నివేదించారు. అప్పటి నుంచి ఈ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది.
ఎస్. కోదార్ తీర్పే చెల్లుబాటు
ఈ వివాదంలో 1974లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్. కోదార్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసు తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలించింది. అమ్మకాల పన్నుపై శాతంగా లెక్కించే అదనపు పన్ను కూడా అమ్మకాల పన్ను రేటు పెంపుగానే పరిగణించాలని ఆ తీర్పు స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా ఆ తీర్పు చట్టబద్ధంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. గతంలో ఈ అంశంపై ఉన్నట్లు భావించిన న్యాయపరమైన విభేదాలు ఇప్పుడు లేవని పేర్కొంది.
జీఎస్టీతో పాత వివాదానికి ప్రాధాన్యం తగ్గింది
2017లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడంతో పాత అమ్మకాల పన్ను చట్టాలు, వాటికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. దీంతో అప్పట్లో తలెత్తిన వివాదానికి భవిష్యత్తులో పెద్దగా ప్రాధాన్యం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 1999లో నివేదించిన అంశంపై ఇక ప్రత్యేకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే ఎస్. కోదార్ కేసులో వెలువడిన న్యాయసూత్రాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది.
పంజాబ్ జనరల్ సేల్స్ టాక్స్ చట్టం-1954లోని సెక్షన్ 30 ప్రకారం అమ్మకాల పన్ను నుంచి మినహాయింపు పొందిన పారిశ్రామిక సంస్థలపై కూడా సర్‌చార్జి విధించవచ్చా అనే అంశాన్ని సుప్రీంకోర్టు తేల్చలేదు. అలాగే పంజాబ్ సామాజిక భద్రతా చట్టం-2000 కింద వసూలు చేసిన సెస్‌ను నేరుగా సామాజిక భద్రతా నిధికి జమ చేయవచ్చా లేక ముందుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం రాష్ట్ర సమీకృత నిధిలో జమ చేయాలా అనే ప్రశ్ననూ భవిష్యత్తు విచారణకు వదిలేసింది.












