భారతీయ యువత ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన 'ఫైర్‌సైడ్ చాట్'లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ (AI) వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని, నూతన నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.
కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక చర్చా గోష్టిలో కేటీఆర్ మాట్లాడుతూ, భారత్ ఆర్థిక గమనం, వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన దశాబ్దంలో మౌలిక సదుపాయాల రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, ఇకపై కాపీ-పేస్ట్ పద్ధతి కాకుండా సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వాలు, సమాజం ఈ మార్పుకు ఇంకా సిద్ధంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌ను వ్యవస్థాపకతకు కేంద్రంగా పేర్కొంటూ, అక్కడి ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్ స్పేస్‌లు, మెంటార్ల ప్రోత్సాహం వల్ల 'యూనికార్న్' సంస్థలు పుట్టుకొచ్చాయని వివరించారు. దేశంలో వ్యవస్థాపకత పెరగాలంటే ఒక పటిష్టమైన 'ఎకో సిస్టమ్' అవసరమని, కేవలం పథకాలు సరిపోవని అభిప్రాయపడ్డారు. యువ జనాభా ఒక శక్తితో పాటు సవాలు అని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని చెప్పారు.
మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని కేటీఆర్ సూచించారు. పెద్ద కలలు కనాలని, చిన్న విజయాలకు సంతృప్తి చెందవద్దని పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.






