సంగారెడ్డి, 2026-11-27
సంగారెడ్డి పట్టణంలోని లలిత ఫెర్టిలిటీ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.లలితాదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తన బృందంతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వైద్య రికార్డుల నిర్వహణ, సిబ్బంది వివరాలు, మందుల నిల్వలు, పరిశుభ్రత, అత్యవసర వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కన్సల్టింగ్ వైద్యుల పేర్లు, వారి విద్యార్హతలు, వైద్య మండలి నమోదు సంఖ్యలతో కూడిన వివరాలను బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఫెర్టిలిటీ కేంద్రంలో పని చేస్తున్న ఆండ్రాలజిస్ట్ వివరాలను కూడా బోర్డులో పొందుపరచాలని సూచించారు. ఆసుపత్రి భద్రతకు సంబంధించి వెంటనే ఫైర్ ఆడిట్ నిర్వహించి నివేదిక పొందాలని, అగ్నిమాపక భద్రతా నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిజేరియన్ ప్రసవాల రేటును మరింత తగ్గించాలని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లకు తావివ్వకూడదని పేర్కొన్నారు. అదేవిధంగా స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే వినియోగించాలని, అనుమతి పొందిన ప్రాంతాల నుంచి ఇతర చోట్లకు మార్చకూడదని స్పష్టం చేశారు..ఫెర్టిలిటీ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే పని చేయాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


