మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 17
పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. జిల్లాలో నవంబర్ నెలకు కొత్తగా 10,529 పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు.
వీరిలో 2,058 మంది దివ్యాంగులు, 6,532 మంది వితంతువులు, 325 మంది గీత కార్మికులు, 22 మంది చేనేత కార్మికులు, 1,592 మంది ఒంటరి మహిళలు ఉన్నారని వెల్లడించారు. క్యాతన్‌పల్లి, మందమర్రిలో 1,040 మందికి, జైపూర్‌లో 509 మందికి, భీమారంలో 231 మందికి పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి పనులపై మంత్రి వివరణ
చెన్నూరు నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అమృత్ పథకం కింద చెన్నూరుకు రూ.30 కోట్లు, క్యాతన్‌పల్లికి రూ.40 కోట్లు, మందమర్రికి రూ.30 కోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామీణ రహదారులకు రూ.80 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లకు రూ.60 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5,500 ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకోగా, ఇప్పటికే 1,800 ఇళ్లు పూర్తయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అర్హులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో 600 ఇళ్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమనపల్లలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని చెప్పారు.



