మంచేరియల్, 9 November
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన నివాసంలో 130 మంది లబ్ధిదారులకు రూ.50,53,700 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి కష్టాల్లో అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల కష్టాల్లో తోడుగా, ఆపదలో అండగా, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


