నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల తన సోషల్ మీడియాలో బచ్ గయే (బతికిపోయా) అని పోస్ట్ చేయడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదైనా ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఆయన స్వయంగా అసలు విషయం వెల్లడించడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.
తన బ్లాగ్‌లో అమితాబ్ ఈ ఘటన గురించి వివరించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం షూటింగ్ సమయంలో తన ప్యాంటు బెల్ట్ తెగిపోయిందని, వెంటనే ఓ డ్రాస్ట్రింగ్ (తాడు)తో దాన్ని కట్టుకుని పరిస్థితిని చక్కదిద్దుకున్నానని తెలిపారు. అందుకే బతికిపోయా అని రాసినట్లు వివరించారు.
భద్రతా బెదిరింపుల నేపథ్యంలో
ఇటీవల అమితాబ్ బచ్చన్‌కు ముప్పు ఉందంటూ, ఆయన నివాసం జల్సాకు బాంబు బెదిరింపులు వచ్చాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన బచ్ గయే వ్యాఖ్యను అభిమానులు మరో కోణంలో అర్థం చేసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన వివరణతో ఆ పోస్ట్‌కు వ్యక్తిగతంగా జరిగిన చిన్న ఇబ్బందే కారణమని స్పష్టమైంది.
అమితాబ్ వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


