అమెరికాలోని పౌరులు, విదేశాల్లో ఉన్న అమెరికా సిబ్బందిపై ఇరాన్ నుంచి ముప్పు గణనీయంగా పెరిగిందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ హెచ్చరించారు. అమెరికా ప్రతినిధుల సభ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌కు సంబంధించిన హింసాత్మక కుట్రలను గుర్తించడం, అడ్డుకోవడం, ఎదుర్కోవడంపై అమెరికా నిఘా సంస్థలు దృష్టి సారిస్తున్నాయని జే క్లేటన్ తెలిపారు. మధ్యప్రాచ్యంతో పాటు ఇతర దేశాల్లోనూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని గతంలో వెల్లడించిన నిఘా నివేదికలను ఆయన ప్రస్తావించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరిలో ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించిన నేపథ్యంలో, ఇరాన్ కూడా అమెరికా బలగాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కొన్ని ప్రాంతాల్లో అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను వెనక్కి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. వాషింగ్టన్లో ఇరాన్ డర్టీ బాంబు దాడికి కుట్ర పన్నుతోందంటూ వచ్చిన వార్తలపై క్లేటన్ నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదు. అయితే, ఇలాంటి సామూహిక విధ్వంస ముప్పులు కొత్తేమీ కాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం, రాజధాని వాషింగ్టన్కు తక్షణ ముప్పు ఉందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.


