ప్రభుత్వం సానుకూలత చూపకపోతే మిలియన్ మార్చ్ కు సిద్ధమవుతామని, రాజధానిలో ముదిరాజుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుందని, తమ జాతి సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందని, దీన్ని సహించేది లేదని, తమ హక్కుల నెరవేర్పు కోసం ఎందాకైనా సిద్ధమని ముదిరాజులు హెచ్చరించారు.
బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి తమను మార్చితేనే విద్య, రాజకీయ చైతన్యం వస్తుందని, మత్స్య సంపదలో సమాన వాటాలు కల్పించాలని, పరికరాలు, పనిముట్లు, రుణాలు, బీమా, ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇవ్వాలని కోరారు.
తమ జాతి 40 లక్షల జనాభాను లెక్కల్లో 15 లక్షలుగా చూపడం అన్యాయమని, విద్య, ఉపాధి అవకాశాలు పెంచాలని, ప్రభుత్వాలు మారినా ముదిరాజులపై వివక్ష కొనసాగుతోందని, తమ లెక్కలు తేల్చి రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి, కాంట్రాక్టులలో తమ శాతం కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు.
హక్కుల సాధన కోసం అంకుటిత దీక్షతో ముందుకు సాగుతామని, ముదిరాజుల జెండాను గ్రామ గ్రామాన ఎగురవేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గ్రామం నుంచి రాష్ట్రం దాకా సమరభేరి మోగిస్తామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ స్పీకర్, ముదిరాజ్ రాష్ట్ర మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బండ ప్రకాష్ స్పష్టం చేశారు.
గురువారం మంచిర్యాలలోని రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి నివాసంలో మీడియాతో మాట్లాడారు. దివంగత వైఎస్ తమను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చినప్పుడు అడ్డుపడిన వారు కోర్టు కేసుల ద్వారా వెనక్కి లాగారని, ప్రస్తుత ఎన్నికల వాగ్దానంలో బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే మాట ఇచ్చి, ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్నా కాలయాపన చేస్తోందని అన్నారు.
దీంతో ముదిరాజులు విద్యా, ఉపాధి, ఫీజు రీయింబర్స్మెంట్, కాంట్రాక్టు పనులు, ఉద్యోగాలు, అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. తమ హక్కుల సాధనకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతూ, క్షేత్రస్థాయిలో సమావేశాలు, సదస్సులు, సభలు నిర్వహించి, జాతి చైతన్యంతో హక్కుల సాధన దిశగా తమ పయనం కొనసాగుతుందని అన్నారు.
ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి , జిల్లా అధ్యక్షులు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శులు దబ్బెట తిరుపతి, తండబోయిన శ్రీకాంత్, యువత రాష్ట్ర నాయకులు గరిక సుమన్ తదితరులు పాల్గొన్నారు.











