జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల పరిస్థితి, విద్యుత్ వైర్లు వంటి అంశాలను సంబంధిత శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన చెరువులు, కుంటలు, శోభాయాత్ర మార్గాలను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, విద్యుత్ వైర్లు, లైటింగ్ తదితర అంశాలను సంబంధిత శాఖల సమన్వయంతో పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా బారికేడ్లను దాటి నీటిలోకి వెళ్లకూడదని, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలను నిలిపివేయకూడదని, ప్రమాదకర వస్తువులు, నిషేధిత సామగ్రిని ఊరేగింపుల్లో వినియోగించకూడదని సూచనలు జారీ చేశారు.
మద్యం సేవించి శోభాయాత్రల్లో పాల్గొనడం, వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. విద్యుత్ వైర్లను చేతులతో గానీ, కర్రలతో గానీ తాకకుండా, విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.












