సంగారెడ్డి కేంద్ర మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య, కార్యదర్శి యం.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపారని తెలిపారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటిన గాంధీజీ ఆదర్శప్రాయులని అంజయ్య కొనియాడారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు.












