ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వృథాను అరికట్టాలని ఆమె సూచించారు.
శుక్రవారం మండలం కానుకుంట గ్రామంలో అదనపు కలెక్టర్ టి.ఎల్. సంగీతతో కలిసి వాణి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో సాగవుతున్న పత్తి, కంది, టమాటా పంటలను పరిశీలించి, పత్తి సాగు చేస్తున్న రైతు బాల్రెడ్డితో మాట్లాడి పంటల పరిస్థితి, నీటి లభ్యత, సాగు వివరాలను ఆమె తెలుసుకున్నారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె రైతులకు సూచించారు. ప్రతి రైతు పొలంలో ఫామ్ పాండ్స్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని ఆమె అధికారులకు తెలిపారు. వీబీ-జీ రామ్జీ పథకం కింద పని దినాలను సద్వినియోగం చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైన చోట పంట విరామం పాటించేలా రైతులను ప్రోత్సహించాలని ఆమె స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రానున్న రోజుల్లో ఎదురయ్యే నీటి సమస్యలపై ప్రజలకు వాస్తవిక పరిస్థితులను వివరించాలని ఆమె తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో వాణి ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పంటల పరిస్థితి, వర్షపాతం, తాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా, పశుగ్రాసం లభ్యత, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై ఆమె సమీక్షించారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలు చేతికొచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే యాసంగి సీజన్లో నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రైతులు ఆరుతడి పంటలు ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని ఆమె సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా పంటల పరిస్థితిని పరిశీలించి, పంటల రక్షణకు రైతులకు తగిన సూచనలు అందించాలని ఆమె అన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థాయి, బోర్లలో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు మార్గనిర్దేశం చేయాలని ఆమె తెలిపారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, నీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆమె అన్నారు. నీటి సరఫరాలో వృథాను అరికట్టి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా వాటర్ రిసోర్సెస్ కమిటీలకు అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో నీటి సంరక్షణకు సంబంధించిన తీర్మానాలు చేయించాలని ఆమె తెలిపారు.












