మంచిర్యాల జిల్లా కోటపల్లి కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో మేకల కాపరులపై బీట్ అధికారి తిరుపతి దాడి చేసిన ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి తక్షణమే స్పందించారు. బాధితులను పరామర్శించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆలుగామ గ్రామానికి చెందిన మేకల కాపరులు కోర్తే సంతోష్, మారబోయిన ఓదెలుపై ఆదివారం బొప్పారం బీట్ అధికారి తిరుపతి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం వెంకటస్వామి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి పరామర్శ, భరోసా
విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
ఈ దాడికి బాధ్యులైన అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. తన విజ్ఞప్తికి తక్షణమే స్పందించి, బాధితులకు అండగా నిలిచిన మంత్రి వివేక్ వెంకటస్వామికి దుర్గం వెంకటస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












