సంగారెడ్డిలో సద్దుల బతుకమ్మ సంబరాలు ముగిశాయి. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. బతుకమ్మ వేడుకలతో పూల పరిమళాలు వెదజల్లిన సంగారెడ్డి పట్టణం ఇప్పుడు విజయదశమి వేడుకలకు ముస్తాబవుతోంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కింది బజార్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా ముగియగా, అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కింది బజార్ చెరువు కట్టపై ఎనిమిది టన్నుల పూలతో ఏర్పాటు చేసిన 32 అడుగుల మహా బతుకమ్మ, ఆరు వేదికలపై మహిళల ఆటపాటలు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాది మంది మహిళల సందడితో బతుకమ్మ సంబురాలు ముగిశాయి. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న దసరా వేడుకల ఏర్పాట్లను సోమవారం రాత్రి జగ్గారెడ్డి స్వయంగా పరిశీలించారు. స్టేడియం అంతటా కలియతిరుగుతూ వేదిక నిర్మాణం, సౌండ్ సిస్టమ్, ప్రేక్షకుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన వేదిక ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు వివరించారు. సామాన్య ప్రజలు సైతం కార్యక్రమాలను సౌకర్యవంతంగా వీక్షించేలా సీటింగ్ ఉండాలని సూచించారు. దసరా ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు స్టేడియంలోని ప్రతి ఒక్కరినీ అలరించేలా ఏర్పాట్లు ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. ముఖ్యంగా వేదికపై నుంచి వచ్చే శబ్దం స్టేడియం చివరి వరుసలో కూర్చున్న వ్యక్తికి సైతం స్పష్టంగా వినిపించేలా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ రావణాసురుడి ప్రతిమను జగ్గారెడ్డి పరిశీలించారు. రావణ దహనం నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వాహకులతో చర్చించారు. రావణ దహనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దసరా వేడుకల్లో భాగంగా కాల్చేందుకు సిద్ధం చేసిన బాణాసంచాను పరిశీలించారు. బాణాసంచా కాల్చే సమయంలో భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వీక్షకులకు సురక్షిత దూరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
గత మూడు దశాబ్దాలుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ రావణాసురుడి ప్రతిమ దహనం, ఆకట్టుకునే బాణాసంచా ప్రదర్శనలు, ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. బతుకమ్మ సంబురాలతో ఇప్పటికే పండుగ శోభను సంతరించుకున్న సంగారెడ్డి పట్టణంలో దసరా వేడుకలను సైతం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బతుకమ్మ పాటల సందడి ముగిసిన వెంటనే విజయదశమి వేడుకల హడావుడి మొదలవడంతో పట్టణంలో పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు జార్జ్, బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీహరి, బెస్త నగేష్ తదితరులు పాల్గొన్నారు.












