ప్రజాపాలన సర్వేలో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని, ఎల్-1తో పాటు ఎల్-2, ఎల్-3 జాబితాల్లో ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాపాలనఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన పలు సమస్యలను వివరించి, పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాపాలన సర్వేలో చిన్నచిన్న పొరపాట్ల కారణంగా వేలాది మంది అర్హులు ఎల్-2, ఎల్-3 జాబితాల్లోకి వెళ్లారని, అటువంటి వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులకు గడువు విధించాలని సూచించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు పొందిన వారిలో ప్రస్తుతం అర్హులుగా ఉన్నవారికి నిబంధనల ప్రకారం కొత్త ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా భూ సమస్యలే ఎదురవుతున్నాయని పేర్కొంటూ, మండలంలోని ఇబ్రహీంపూర్, ఉల్లిదిమ్మాయిపల్లి, దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లి, ఆకారం గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












