మంచేరియల్, 17 November
మంచిర్యాల నుంచి చెన్నూరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మంచిర్యాల: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమన్వయం, నాయకుల మధ్య ఆధిపత్య ధోరణులపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనల సమయంలో కనిపించే హడావుడికి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మధ్య వ్యత్యాసం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మందమర్రి, రామకృష్ణాపూర్, కేతనపల్లి ప్రాంతాల్లో ఎవరికి వారే అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే తరహా పరిస్థితులు చెన్నూరు ప్రాంతంలోనూ ఉన్నాయనే చర్చ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. నాయకుల మధ్య సమన్వయం కంటే వ్యక్తిగత ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
ఒక నాయకుడు వందమంది కార్యకర్తలను తయారు చేసి పార్టీకి బలమైన పునాదిగా నిలవాల్సి ఉండగా, మంత్రి, ఎంపీ పర్యటనల సమయంలో మాత్రమే హడావుడి చేస్తూ కనిపించడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఎలా బలోపేతం అవుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ప్రజల సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు, స్థానిక నాయకుల వినతులు మంత్రి, ఎంపీ దృష్టికి నేరుగా చేరడం లేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో కొందరు నేతలే అన్నీ చక్కబెడుతున్నారనే ఆరోపణలతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మంచిర్యాల నుంచి చెన్నూరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.


