హింద్ మజ్దూర్ సభ (HMS) అనుబంధ HMS ఆటో డ్రైవర్స్ యూనియన్, మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు మరియు సంక్షేమ చర్యల కోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
HMS జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డు, ఇంటి స్థలాలు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలకు గిరాకీ తగ్గి, జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు, రుణ భారం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు వార్షికంగా రూ.12,000 ఆర్థిక సహాయం, ఆటో సంక్షేమ బోర్డు, ఇంటి స్థలాల కేటాయింపు వంటి డిమాండ్లను వినతిపత్రంలో పొందుపరిచారు.
గుర్తింపు కార్డులు, ప్రమాద, ఆరోగ్య బీమా, పిల్లలకు విద్యా సహాయం, ఆటో స్టాండ్ల వద్ద మౌలిక వసతులు, వృద్ధాప్య పింఛన్, తక్కువ వడ్డీ రుణాలు కూడా కోరారు. ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది కుటుంబాల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.











