రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసేందుకు, అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను సందర్శించి, భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను డీసీపీ ఎ. భాస్కర్ సందర్శించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
డీసీపీ మాట్లాడుతూ, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, పశువుల సంతలు, బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల పనితీరుపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి చెక్‌పోస్టులో పోలీస్, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు కఠినంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










