చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో ఈసారి వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తద్వారా కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని మంత్రి సూచించారు. ధాన్యం నిల్వ కోసం గోదాముల సౌకర్యాలను, హమాలీల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.
కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి అదనంగా 75 లారీలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని చెప్పారు.
రాబోయే వారం రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని విజ్ఞప్తి చేశారు.








