దేశాభివృద్ధికి రోడ్లు కీలకమని, కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా పాదచారుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఈనెల 22 వరకు జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ () నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు ఉండాలని, ఫుట్పాత్లు, రోడ్డు దాటేందుకు సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధిలో పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణలో రహదారుల అభివృద్ధి కోసం 202627 బడ్జెట్లో రూ.5,677 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్, ఫ్యూచర్ సిటీబందర్ గ్రీన్ఫీల్డ్ హైవే వంటి కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.13,006 కోట్లతో 441 రోడ్ల పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత, పర్యావరణహిత నిర్మాణ పద్ధతుల ద్వారా రహదారుల నాణ్యత, భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్మించే రోడ్లు మరింత సురక్షితంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


