దొంగ నా కొడుకు సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్న సుష్మితా శెట్టి తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో తాను చాలా క్యూట్, బబ్లీగా ఉండే చలాకీ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని సుష్మిత తెలిపారు. హీరోను ప్రాణంగా ప్రేమించే తన పాత్ర, ఆ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుందని చెప్పారు. తనను తాను చాలా తెలివైనదానిగా భావించుకున్నప్పటికీ, అమాయకత్వంతో తెలియకుండానే ఒక నేరంలో చిక్కుకుంటుందని వివరించారు. తాను తెలివిగా చేయాలనుకున్న పనులు చివరకు హాస్యాస్పదంగా మారతాయని, తన పాత్రలో అమాయకత్వంతో కూడిన వినోదం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన సుష్మితా శెట్టి చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. దివంగత నటి శ్రీదేవి తనకు స్ఫూర్తి అని చెప్పారు. విదేశాల్లో చదువుకునే సమయంలో రంగస్థల ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. గతంలో జగమే సంగీతం వెబ్ సిరీస్లో నటించిన ఆమెకు కథానాయికగా ఇదే తొలి చిత్రం. భవిష్యత్తులో మహానటి తరహా భావోద్వేగాలతో కూడిన పాత్రలతో పాటు క్రీడా నేపథ్య చిత్రాలు, ప్రేమకథా వినోద చిత్రాలు, భయానక చిత్రాల్లో నటించాలని ఉందని, తన మనసులోని కోరికను వెల్లడించారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.


