ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)లో ఉత్తీర్ణత సాధించకుండానే దాదాపు పదేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు కొనసాగించవచ్చని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు ఉన్నప్పటికీ, నేరపూరిత చర్యల విషయంలో క్రిమినల్ కోర్టుల అధికారాన్ని అది అడ్డుకోలేదని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి 2011లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో తాత్కాలికంగా న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్లలోగా ఏఐబీఈలో ఉత్తీర్ణత సాధించాలి. అలా ఉత్తీర్ణత సాధించకపోతే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత నిలిచిపోతుంది. అయితే, సదరు వ్యక్తి దాదాపు పదేళ్లపాటు పరీక్ష రాయకుండానే బంగారుపేట, కేజీఎఫ్, కోలార్ ప్రాంతాల్లోని కోర్టుల్లో న్యాయవాదిగా వ్యవహరించినట్లు ఫిర్యాదు నమోదైంది. 2021లో మాత్రమే ఆయన పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారంపై మరో న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు న్యాయవాదిగా వ్యవహరిస్తూ న్యాయమూర్తులు, క్లయింట్లు, ఇతర న్యాయవాదులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. బార్ కౌన్సిల్ రికార్డుల్లోనూ ఆయన ఏఐబీఈ ఉత్తీర్యుల జాబితాలో లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బార్ కౌన్సిల్‌ను ఆశ్రయించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు
ఈ కేసును విచారించిన జస్టిస్ హెచ్.పీ. సందేశ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. క్రిమినల్ కేసు పెట్టడానికి ఫిర్యాదుదారుడు తప్పనిసరిగా ముందుగా బార్ కౌన్సిల్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నేరం సమాజానికి సంబంధించిన అంశమని, చట్టం ప్రత్యేకంగా పరిమితి విధించనంతవరకు ఎవరైనా క్రిమినల్ చట్టాన్ని అమలు చేయాలని కోరవచ్చని పేర్కొంది. బార్ కౌన్సిల్ తీసుకునే క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కోర్టులు చేపట్టే విచారణలు వేర్వేరు అని వివరించింది. ఒక వ్యవస్థలో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నంత మాత్రాన మరో వ్యవస్థకు ఉన్న అధికారాలు రద్దు కావని స్పష్టం చేసింది.
అడ్వొకేట్స్ చట్టంలోని సెక్షన్ 45 కీలకం
ఏఐబీఈలో ఉత్తీర్ణత సాధించకుండా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. అర్హత లేకుండా కోర్టులో లేదా సంబంధిత అధికారుల ముందు న్యాయవాదిగా వ్యవహరించే వారిపై అడ్వొకేట్స్ చట్టంలోని సెక్షన్ 45 కింద చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపింది. ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని 419, 420, 120-బి, 511 సెక్షన్లతో పాటు అడ్వొకేట్స్ చట్టంలోని సెక్షన్ 45 కింద ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఈ నేరాలు వర్తిస్తాయా లేదా అన్నది దర్యాప్తు అధికారి పరిశీలించాలని, సెక్షన్ 45 కింద కేసు కొనసాగింపునకు సంబంధించిన అంశాన్ని కూడా స్వతంత్రంగా పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.
బార్ కౌన్సిల్‌కు కీలక ఆదేశాలు
ఏఐబీఈలో ఉత్తీర్ణత సాధించని వారు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయకుండా పర్యవేక్షించేందుకు కర్ణాటక రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదుల నమోదు తేదీ, రెండేళ్ల గడువు ముగిసే తేదీ వివరాలను డిజిటల్ రికార్డుల్లో నిర్వహించాలని సూచించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారి జాబితాను సిద్ధం చేసి, ప్రాక్టీస్ హక్కులు నిలిపివేయాల్సిన వారిని గుర్తించాలని తెలిపింది. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకుంటూ ఏఐబీఈ ఫలితాలను ధ్రువీకరించాలని, అర్హత లేని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, చర్యలు తీసుకునే ముందు సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థపై 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.


