సంగారెడ్డి, 2026-11-27
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో 9,960 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 9,960 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని ఎస్పీ వెల్లడించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరీక్ష పూర్తయ్యే వరకు జిరాక్స్ కేంద్రాలు తెరవడానికి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, అనవసరంగా తిరగడం నిషేధం. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతరం నిఘా కొనసాగుతుందని, కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని ఎస్పీ తెలిపారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
1. హాల్ టికెట్ పై ఫోటోకు కేటాయించిన స్థలంలో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంతకం చేయాలి. 2. పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి చిరునామాను నిర్ధారించుకోవాలి. 3. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
4. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ట్యాబ్లెట్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, నోట్స్, బ్యాగులు, పర్సులు, నగలు వంటి వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో వస్తువులను భద్రపరిచే సదుపాయం ఉండదు. 5. అభ్యర్థులు నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ మాత్రమే పరీక్ష హాలులోకి తీసుకెళ్లాలి. పెన్సిళ్లు, జెల్ పెన్నులు, ఇతర రంగుల పెన్నులు ఉపయోగించరాదు.
6. పరీక్ష సమయంలో అభ్యర్థుల ఫోటో, వేలిముద్రలు, సంతకాలను సేకరించడంతో పాటు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ నిర్వహిస్తారు. కాబట్టి వేళ్లపై మెహందీ, తాత్కాలిక టాటూలు లేదా బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగించే పదార్థాలు లేకుండా చూసుకోవాలి. 7. ప్రశ్నపత్రం అందుకున్న వెంటనే అందులో మొత్తం 200 ప్రశ్నలు, అన్ని పేజీలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఏవైనా లోపాలుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.
8. ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించబడుతుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి సమాధానాలను గుర్తించేటప్పుడు జాగ్రత్త వహించాలి. 9. హాల్ టికెట్‌పై పొందుపరిచిన అన్ని సూచనలు, నిబంధనలను అభ్యర్థులు ముందుగానే పూర్తిగా చదివి తప్పనిసరిగా పాటించాలి.


