హైదరాబాద్లో డబ్బు ఆశ చూపి పేద, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను అండాల సేకరణకు వినియోగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో 43 మంది మహిళలను రక్షించి, తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
డబ్బు ఆశ చూపి అండాల సేకరణకు వినియోగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఒక్కో అండదానానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని చెప్పి, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి మహిళలను హైదరాబాద్కు తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నగరంలోని అద్దె ఇళ్లలో వారిని ఉంచి, హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు 43 మంది మహిళలను రక్షించి, తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ పత్రాలు, అనుమతి లేని వైద్య ప్రక్రియలు, మహిళలపై ఒత్తిడి, ఆర్థిక దోపిడీ జరిగాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అక్రమ కార్యకలాపాల్లో ఐవీఎఫ్ కేంద్రాలు, అండాల బ్యాంకుల పాత్రపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. ముఠా కార్యకలాపాలు, వారి వెనుక ఉన్న వ్యక్తులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులైన మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.


