సంగారెడ్డి, 19 November
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రంగోలి పోటీలు నిర్వహించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజున నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల రంగోలీలతో తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఇందిరా గాంధీ జీవితం, మహిళా శక్తి, దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలను ప్రతిబింబించేలా రంగోలీలను తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, ధైర్యం, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె జీవితం నేటి యువతకు, ముఖ్యంగా విద్యార్థినులకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోజ్ కుమార్, లైబ్రరియన్ లలితాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.


