నిర్మల్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలను తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ - IJU) జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు (అక్రిడేషన్లు) ఇవ్వడంలో జాప్యం తగదని, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు తప్పనిసరి అని వారు అభిప్రాయపడ్డారు.
సొంత ఇల్లు లేని, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న జర్నలిస్టుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలను కేటాయించి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని వినతిపత్రంలో కోరారు. ఇది జర్నలిస్టుల దీర్ఘకాలిక ఆకాంక్ష అని వారు పేర్కొన్నారు.
విద్యా రంగంలో పెరుగుతున్న భారాలను దృష్టిలో ఉంచుకుని, జర్నలిస్టుల పిల్లలు చదువుకునే ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా యంత్రాంగం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, జల్ద మనోజ్, కార్యదర్శులు సట్ల హనుమాన్లు, రాజేశ్వర్, డి ఎస్ మధు, వరప్రసాద్, బ్రహ్మయ్య, గంగారం, కల్చర్లు మరియు పలువురు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.












