న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం కల్పించిన పన్ను ప్రయోజనాలను సంస్థలు ఉద్యోగుల జీతాల పెంపునకు, కొత్త నియామకాలకు ఎలా ఉపయోగించాయో ఆయన ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫిక్కీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో పాటు, ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రయోజనాలు పొందిన సంస్థలు ఉద్యోగుల జీతాలు పెంచాయా కొత్తగా ఉద్యోగులను నియమించుకున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మాత్రమే ఆర్థిక వృద్ధికి కృషి చేయాలని ఆశించకుండా, కంపెనీలు కూడా ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపునకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడకుండా అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడేలా నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని పారిశ్రామిక సంస్థలకు సూచించారు. భారతదేశం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకుని ఎగుమతులను పెంచుకోవాలని, వ్యవసాయం, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెంచాలని కోరారు. రాబోయే 20 ఏళ్ల పెట్టుబడి నిర్ణయాల్లో దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


