మంచిర్యాల పట్టణ అభివృద్ధి తీరును ప్రశంసిస్తూ, దానిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సంకల్పం, నిబద్ధత వల్లే మంచిర్యాలలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని ఆయన కొనియాడారు.
మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను, మంత్రి శ్రీధర్ బాబు, ప్రేమ సాగర్ రావు కలిసి పట్టణంలో పర్యటించి, రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులను పరిశీలించామని, అవి చాలా సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఇక్కడి పనులు నిరూపిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను మంచిర్యాలకు పంపించి, ఇక్కడి అభివృద్ధిని ఒక మోడల్‌గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అభివృద్ధికి సహకరించిన స్థానిక ప్రజలకు, వ్యాపారులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలో వరద ముప్పు ఉన్న ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం వల్ల గర్భిణీలు ఎదుర్కొన్న ఇబ్బందులను చూపించారని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతామని ఇచ్చిన మాట ప్రకారం, వేగంగా పనులు ప్రారంభించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
మంచిర్యాల ప్రజలు చాలా అదృష్టవంతులని, 50-100 ఏళ్ల భవిష్యత్తును ఆలోచించి, దూరదృష్టితో పునాదులు వేసేవాడే నిజమైన నాయకుడని, అలాంటి నాయకత్వం, ప్రజల మద్దతు ఇక్కడ ఉండటం వల్లే విద్య, వైద్యం, దేవాలయాలు, ఇరిగేషన్ ఇలా ప్రతి రంగంలోనూ మంచిర్యాల దూసుకుపోతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, దశాబ్దాల తర్వాత సరైన ఎమ్మెల్యే దొరకడం వల్లే అన్ని రంగాలకు సంబంధించిన పునాదులు పడుతున్నాయని, ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ఆయన పని చేస్తున్నారని కొనియాడారు.
మంచిర్యాల అభివృద్ధి కోసం దశాబ్దాల తర్వాత ఒక మంచి ప్రజాప్రతినిధిని ప్రజలు గెలిపించుకున్నారని, భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారంలో మంచిర్యాల నియోజకవర్గానికి 'సింహభాగం' ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.









