మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 31
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే లక్ష్యంతో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ వంటశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందనుంది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు (పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్) లో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ వంటశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు.
ఏ బిడ్డా ఆకలితో బడికి వెళ్లకూడదన్నదే ప్రస్తుత ప్రభుత్వ సంకల్పమని, విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని ఎమ్మెల్యే అన్నారు. మానవ వనరులే రాష్ట్ర సంపద అని, ప్రతి విద్యార్థిని సానబెట్టిన వజ్రాల్లా తీర్చిదిద్ది, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి మంచిర్యాల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












