ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ నేపథ్యంలో, మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ వినతిని తెలియజేశారు.
మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, సుధాకర్ మాట్లాడుతూ, ఆన్లైన్ ఫార్మసీల ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఇది యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల స్థానిక మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
బంద్ సందర్భంగా అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం ఉండదని, ప్రజలకు అవసరమైన మందుల సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని కోరారు.












