మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపురం శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. పాలమూరు ప్రజల ఇలవేల్పుగా కొలిచే కురుమూర్తిరాయుడి ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి దళిత పూజారులు ముత్యాల పల్లకీలో ఉద్దాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా, దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఉద్దాలను తాకి పునీతులయ్యేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతో పాటు కురుమూర్తిస్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. భక్తుల నామస్మరణతో కురుమూర్తిగిరులు మార్మోగాయి. ఉత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.


