నర్సాపూర్, 19 November
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయిన పరిస్థితిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో, రైతులకు ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా వారితో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో నీరు లేక నెర్రెలు బారి ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఇటీవల తన పొలానికి నిప్పు పెట్టుకున్న ఘటనపై స్పందించిన ఆయన, ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్ ద్వారా నర్సాపూర్ గ్రామ రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
అనంతరం నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో నీటి కొరత కారణంగా సుమారు 80 శాతం పంటలు ఎండిపోయాయని, పొలాలు నెర్రెలు బారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుచూపుతో సాగునీటిని విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో వేల ఎకరాల పంటలు ఎండిపోవడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసమర్థ పాలనే కారణమని విమర్శించారు. కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ కక్షతో నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించలేక పంటలు వేయవద్దని సూచించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏర్పడినది సహజ కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువని వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తే, ప్రస్తుతం రోజుకు ఆరు గంటలే ఇస్తున్నారని ఆరోపించారు.
రైతులు ఆరు నెలల పాటు పంటలు వేయవద్దని చెబుతున్న ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ అధికారులు ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యక్తిగత గొడవలను పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
మంచిర్యాల నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని, పంటలు పూర్తిగా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

