సంగారెడ్డి, 2026-11-20
పిల్లలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి బాలసదన్‌లో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు, బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుంటూ, మంచి అలవాట్లను అలవర్చుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. బాలసదన్‌లో ఉంటున్నామనే భావనతో భయపడకుండా, ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిల్లలకు ప్రోత్సాహం అందించారు. అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, పిల్లలు ఏకాగ్రతతో చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు లేరనే భావనతో ఆత్మన్యూనతకు గురికాకుండా, ప్రభుత్వం, అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారనే నమ్మకంతో ముందుకు సాగాలని భరోసా ఇచ్చారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఏఎం రాజారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సౌజన్య, సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటేశం, విష్ణుమూర్తి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం, బాలసదన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సంగారెడ్డి, నారాయణఖేడ్ బాలసదన్ విద్యార్థులు పాల్గొన్నారు.


