రామగుండం నియోజకవర్గంలో ఎమ్మార్వో కార్యాలయం ఖాళీగా ఉండటం, ఫైళ్లు పెండింగ్లో పడటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. పైచదువుల కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
రామగుండం నియోజకవర్గంలో రెవెన్యూ వ్యవస్థ స్తంభించిపోయిందని, ఎమ్మార్వో పదవి ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగంగా మారాయని కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఇన్ఛార్జ్ పాలనలో ఫైళ్లు ముందుకు కదలడం లేదని, సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆమె విమర్శించారు.
అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, అధికారులు లంచాలకు అలవాటు పడ్డారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు అందక వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పాలనా వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, రామగుండం మండలానికి శాశ్వత ఎమ్మార్వోను నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోరుతూ, త్వరగా ఎమ్మార్వోను నియమించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








