సంగారెడ్డి, 2026-11-24
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సోమవారం సాయంత్రం జరిగిన మయూరి ఆర్ట్స్ ఐకానిక్ హానరరీ అవార్డ్స్-2026 కార్యక్రమంలో సంగారెడ్డికి చెందిన వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ కు మయూరి ఐకానిక్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లయన్ సాయి వెంకట్, ప్రముఖ పాన్ ఇండియా సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత జయహో రామానుజ చేతుల మీదుగా లక్ష్మణ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మణ్ మాట్లాడుతూ, తన విద్యా సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ గుర్తింపు తనకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యారంగంలో మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని లక్ష్మణ్ వెల్లడించారు. తన ఎదుగుదలకు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


