సదాశివపేట, 2026-08-20
సదాశివపేట, ఆగస్టు 20, అక్షరవేకువ: నిజాంపూర్ కాలనీకి చెందిన మహేష్ అనే వికలాంగ విద్యార్థికి మండల విద్యాధికారి శంకర్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ ను అందజేశారు. కండరాల, ఎముకల వైకల్యంతో బాధపడుతున్న మహేష్ కు ఈ ట్రైసైకిల్ ఎంతో సహాయపడనుంది.
సదాశివపేట, ఆగస్టు 20, అక్షరవేకువ: నిజాంపూర్ కాలనీకి చెందిన మహేష్ అనే వికలాంగ విద్యార్థికి మండల విద్యాధికారి శంకర్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ ను అందజేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లి రాములమ్మ పేదరికంలో మహేష్ ను ఒంటరిగా పెంచుతోంది. ప్రాథమిక విద్యను నిజాంపూర్ కాలనీలోనే పూర్తి చేసిన మహేష్, కండరాల, ఎముకల వైకల్యంతో బాధపడుతూ, ఎక్కడికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు జూన్ నెలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించే క్రమంలో రాములమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ మహేష్ పడుతున్న ఇబ్బందులను, ట్రైసైకిల్ అవసరాన్ని రాములమ్మ వివరించారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ వెంటనే మండల విద్యాధికారి శంకర్, సదాశివపేట భవిత సెంటర్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తున్న నవీన దృష్టికి తీసుకెళ్లారు.
నవీన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా సీ.యం.వో భీమ్ గొండకు అందించారు. జిల్లా అధికారుల చొరవతో, గురువారం నవీన స్వయంగా రాములమ్మను సంగారెడ్డికి తీసుకెళ్లి మహేష్ కు ట్రైసైకిల్ ను అందజేశారు. ట్రైసైకిల్ అందుకున్న వెంటనే మహేష్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఎప్పటి నుంచో తీరని కోరిక తీరడంతో తల్లి రాములమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సంఘటనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం యొక్క ఆవశ్యకత మరోసారి రుజువైందని పలువురు అభిప్రాయపడ్డారు. వికలాంగ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
మహేష్ కుటుంబం తరపున మండల విద్యాధికారి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవీన, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నవనీత, సునీత, అక్బర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.












