సంగారెడ్డి, 2026-08-29
సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం () కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థిలో నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలు సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థిలో నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలు సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ సమీక్ష సమావేశంలో, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయులు, పాఠశాలల పనితీరు, మూల్యాంకన ఫలితాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయి అంచనా ఫలితాల ఆధారంగా మెరుగైన విద్యను అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 254 కాంపిటెంట్ పాఠశాలలు ఉన్నాయని, అందులో చదువుతున్న విద్యార్థులందరికీ కాంపిటెన్సీలు వచ్చే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి కాంపిటెన్సీలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
మూల్యాంకన ఫలితాల ఆధారంగా విద్యార్థులలో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి, వాటి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్, గణితం అంశాలలో ప్రాథమిక సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలంలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు ఆకస్మిక మూల్యాంకనం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులను అనుసరించి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థులలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. పాఠశాలల్లో లక్ష్య నిర్ధారణ పోస్టర్లను ఏర్పాటు చేసి, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు.
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత పర్యవేక్షణ బృందాలు పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి, ఎఫ్ఎల్ఎన్ అమలును పరిశీలించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల విషయాల వారీ సామర్థ్యాలు, సాధించిన ఫలితాలు, అభ్యసన లోపాలను గుర్తించి, తక్కువ స్థాయి ఫలితాలు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా తల్లిదండ్రులకు కూడా ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, విద్యార్థుల అభ్యసన పురోగతిని తల్లిదండ్రులతో పంచుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి అవసరమైన ప్రాథమిక సామర్థ్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.












